గోరంత ఆలోచన, కొండంత బడ్జెట్.. రాజమౌళిని ముప్పు తిప్పలు పెట్టిన ‘ఈగ’!
on Oct 9, 2024
‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా పరిచయమైన ఎస్.ఎస్.రాజమౌళి 23 సంవత్సరాల్లో 12 సూపర్‌హిట్ సినిమాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. బాలీవుడ్ సైతం రాజమౌళి సినిమాలకు ఫిదా అయిపోయింది. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా తెలుగు సినిమా గురించి మాట్లాడే స్థాయికి టాలీవుడ్‌ని తీసుకెళ్లిన ఘనత రాజమౌళిది. ఛత్రపతి, మగధీర, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారీ చిత్రాలను సైతం అలవోకగా తీసిన రాజమౌళి ‘ఈగ’ని థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారట. అక్టోబర్ 10 ఎస్.ఎస్.రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ‘ఈగ’ వెనుక వున్న కథ ఏమిటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘ఈగ’ ప్రధాన పాత్రలో సినిమా చెయ్యాలన్న ఆలోచన నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచే ఉంది. ఛత్రపతి సినిమా చేస్తున్న సమయంలో అన్నీ వరసగా భారీ బడ్జెట్ సినిమాలే చెయ్యడం కరెక్ట్ కాదు అనిపించింది. ఏదో ఒక చిన్న సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. చిన్న బడ్జెట్ సినిమా అంటే లవ్‌స్టోరీగానీ, కామెడీ సినిమాగానీ, హారర్ మూవీగానీ చెయ్యాలి. అయితే నాకు హారర్ కథలు నచ్చవు. అలాగే కామెడీ, లవ్‌స్టోరీలపై సరైన అవగాహన లేదు. కాబట్టి అలాంటి సినిమాలు చెయ్యలేను. ఇక మిగిలింది ఎక్స్‌పెరిమెంట్. అప్పుడు మరోసారి నాకు ఈగ కాన్సెప్ట్ గుర్తొచ్చింది. దాని కోసం బలహీనుడు.. బలవంతుడిపై నెగ్గడం అనే పాయింట్ తీసుకొని సినిమా చెయ్యాలనుకున్నాం. ఈగలాంటి ప్రాణి మనిషిపై పగ తీర్చుకోవడం అందరికీ నచ్చుతుంది. అందుకే రెండున్నర కోట్లలో ఈ సినిమాను తీసి కొన్ని సెలెక్టెడ్ ఏరియాల్లోనే రిలీజ్ చెయ్యాలనుకున్నాం. అయితే లిమిటెడ్ బడ్జెట్ పెట్టుకోవడం వల్ల మా ప్రయత్నం ముందుకు వెళ్ళలేదు. ఆ సమయంలో నిర్మాత సురేష్‌బాబుగారు ‘బడ్జెట్ గురించి ఆలోచించకండి. కథ రెడీ చేయండి’ అన్నారు. కథ రెడీ చేశాం. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసరికి పెద్ద సినిమాగా మారిపోయింది. ఇక ఈగను విజువల్‌గా క్రియేట్ చెయ్యాలి.
ఆ టైమ్‌కి యానిమేషన్‌పైన, విజువల్ ఎఫెక్ట్స్‌పైన నాకు నాలెడ్జ్ లేదు. ఈగను క్రియేట్ చేసే బాధ్యత మకుట వారికి అప్పగించాం. ఎనిమిది నెలలు కష్టపడి ఈగను క్రియేట్ చేసి ఆ వీడియో మాకు చూపించారు. కానీ, అది ఈగలా లేదు. చూసేందుకు అస్సలు బాగాలేదు. అప్పటికే రూ.10 కోట్లు ఖర్చయిపోయింది. ఇక వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. అందుకే మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాం. అసలు ఈగ క్లోజప్‌లో ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకున్నాను. దాని కోసం స్పెషల్ లెన్స్ తెప్పించి ఫోటో షూట్ చేశాం. అయితే దాన్ని క్లోజప్‌లో చూస్తే చాలా భయంకరంగా ఉంది. అందుకే వికృతంగా ఉన్న ఎలిమెంట్స్‌ని తొలగించి బాగున్నవి మాత్రమే ఉండేలా ఈగను క్రియేట్ చేయమని చెప్పాను. నేను ఏదైతే ఊహించుకున్నానో దానికి తగ్గట్టుగానే విజువల్‌గా ఈగ తయారైంది. అయితే ఈ సినిమాను మర్యాద రామన్న తర్వాత సెట్స్‌కి తీసుకెళ్లాం’ అని వివరించారు రాజమౌళి.
నాని హీరోగా, సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప భయంకరమైన విలన్‌గా నటించి అందరి మెప్పు పొందారు. రూ.40 కోట్ల బడ్జెట్‌తో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ‘ఈగ’ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. 2012 జూలై 6న తెలుగులో ‘ఈగ’గా, తమిళ్‌లో ‘నాన్ ఈ’ పేరుతో, హిందీలో ‘మఖ్ఖీ’గా రిలీజ్ అయింది. మూడు భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా రూ.100 కోట్లు గ్రాస్, రూ.54 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ రూ.8 కోట్లకు సేల్ అవడం విశేషం.
Also Read